తెలంగాణ ప్రభుత్వం అన్ని విషయాల్లో విఫలమైంది

తెలంగాణ ప్రభుత్వం అన్ని విషయాల్లో విఫలమైంది

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ నేత విజయశాంతి. ప్రభుత్వానికి ఎటుచూసినా వైఫల్యాలే తప్ప.. పరిస్థితులను చక్కబెట్టేందుకు అవసరమైన ప్రణాళిక కనిపించడంలేదని విమర్శించారు. రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలన్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఏర్పాట్లు, కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల పరిస్థితిపై హైకోర్టు ప్రశ్నించిన క్రమంలో పాలకులు చురుగ్గా స్పందించి నష్ట నివారణ చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాను అని అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న అవాంఛనీయ పరిణామాలపై గతంలోనే సత్వర చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి ఇంత దారుణంగా తయారయ్యేది కాదన్నారు విజయశాంతి. 

రాష్ట్రంలో ఇంకా 6.90 లక్షలకుపైగా వ్యాక్సిన్ డోసుల నిల్వ ఉన్నా.. గత 3 రోజుల నుంచి వ్యాక్సినేషన్ ఆపేశారని విజయశాంతి ఆరోపించారు. అంతేకాదు కరోనాను ఇప్పటికీ ఆరోగ్యశ్రీలో చేర్చలేదని.. ఆయుష్మాన్ భారత్ రాష్ట్రంలో అమలు కావడంలేదని విమర్శించారు.

మరోవైపు తెలంగాణ రైతులు మరోసారి కడగండ్ల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు విజయశాంతి. వడ్ల కొనుగోలులో ప్రభుత్వ ఉదాసీన వైఖరి ప్రదర్శించడంతో, ధాన్యం వర్షం పాలై రైతులు నష్టపోయారన్నారు.